అనగనగా ఆవకాయ్…

అనగనగా ఆవకాయ్… అంతకు ముందు అది ఒక మామిడికాయ్.
ఆవకాయకి మామిడికాయకి తేడా ఏంటి? వివరాల్లోకి వెళితే అది ఎండాకాలం… ఒక్కో కాలం ఒక్కో రకమైన పండ్లు కాస్తాయి.
అలా ఎండాకాలం అయితే చాలు… మామిడి పండ్లు, ఇప్పుడిది మాకాలం అంటూ వచ్చేస్తాయి.
ఇందులో ఎన్ని రకాల పేర్లో… చెప్పుకుంటూ పోతే పేజి నిండిపోతుంది.
ఇలా రకరకాల మామిడి పండ్లు, కాయలు రకరకాల రుచులతో ఎండాకాలం మొత్తం మనని అలరిస్తాయి. మరి ఎండాకాలం అయిపోతేనో? అవి కనుమరుగు అవుతాయి.
తినడానికి కాదు కదా చూడటానికి కూడా ఒక్కటీ కనిపించదు.
కానీ మనం మనుషులం, తెలివైన వాళ్ళం కదా… ఆ మామిడి కాయల్ని ఎండాకాలంతో పాటు సంవత్సరం అంతా ఆస్వాదించాలి అనే కోరిక పుట్టింది. ఆ ఆలోచనలో నుండి వచ్చిందే మన ఆవకాయ.

ఇప్పుడు మామిడికాయ ఆవకాయగా ఎలా రూపుదిద్దుకుందో… ఎన్ని రంగులు మార్చుకుందో చూద్దాం. ఇక్కడ మనము అన్ని రకాల మామిడికాయలను ఆవకాయగా మార్చలేము. కొన్ని ప్రత్యేక రకమైన మామిడికాయలను ఎంచుకొని వాటిని మాత్రమే ఆవకాయకి ఉపయోగించగలం. మామిడికాయ అంటేనే ఓక ఫీల్‌ ఉంటుంది. అందులో నూజివీడు మామిడికాయలు ఉన్టాయీ… అసలు ఆ ఫీల్ ఏ వేరు. ఈ నూజివీడు మామిడికాయలు ఆవకాయకి బాగా పనికి వస్తాయి. వీటిని కొన్నిగంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత ఆ నీటికి, మామిడికాయలకు ఏర్పడిన స్నేహాన్ని విడదీసి వాటిపైన ఒక్క చుక్క నీటి ఆనవాలు లేకుండా శుభ్రంగా తుడవాలి. చిన్న నీటి చుక్క ఉన్నా మొత్తం పచ్చడికే ప్రమాదం.

ఆ తరువాత కాయలను సమాన ముక్కలుగా కట్‌ చేసి, జీడి తీసేసి, అబ్బో… చాలా కథ ఉంది లేండి! ఇది కేవలం ఇంటర్‌వెల్‌ మాత్రమే, అసలు కథ ముందుంది.

సెకండ్‌ హాఫ్‌ కి వస్తే మంచి నువ్వుల నూనె తీసుకుని దట్టంగా కొట్టించుకున్న కారంతో… అబ్బబ్బో… అసలు ఆ ఆవకాయ ఉంటుందీ…

నాన్న లాంటి నూనె, అమ్మ లాంటి ఉప్పు, భార్య లాంటి కారం, అత్త కూతురు లాంటి ఆవపిండి, మేనమామల్లా మెంతులు అన్ని ఎంత మోతాదులో వేయ్యాలో అంతే తీసుకొని ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో అలా కలిపేసి ఆ ఫస్ట్‌ హాఫ్‌ని సెకండ్‌ హాఫ్‌ని బాగా మిక్స్‌ చేసి ప్రిక్లైమాక్స్‌ లో జాడిలో పేడితే… అప్పుడు క్లైమాక్స్‌లో… హాయిగా ఆవకాయను తినొచ్చు.