అంతా లోక కళ్యాణం కోసమే!

చెట్లు వాటికి దెబ్బ తగిలినా పండును మనకు ఇస్తాయి. మామిడికాయ తన ప్రాణాలు కోల్పోయి ఆవకాయగా అవతరిస్తుంది. ఇక్కడ ఆవకాయ అంటే ఎవరో కాదు, ముసుగు వేసుకున్న మామిడికాయ. ఎవ్వరూ గుర్తుపట్టనట్టుగా రూపం, రంగు, రుచిని మార్చేసుకుంది. కారంగా అలంకరించుకుంది. నూనెలో నిలువుగా మునిగిపోయింది. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను ఏవ్వరూ గుర్తించలేరు కాని ఆవకాయ రుచిని చూసినవారందరు ఇది ఆవకాయగా మారిన మామిడికాయ అని గుర్తిస్తారు. దీని రుచి అద్భుతం అని పొగుడుతారు. మామిడికాయగా ఉన్నప్పుడూ వదలరు ఆవకాయగా మారినా వదలరు. అది ఎవ్వరో ఒకరి నోటికి చిక్కాల్సిందే. జాడీలో దాగి ఉన్నా, ప్యాకెట్స్‌ లో పొందుపరిచినా, అమ్మ అటక మీద దాచిపెట్టినా ఇట్టే పసిగడతారు. ఇంకా లంచ్‌ బాక్స్‌లో ఒకరి కోసం తీసుకెళితే ఇంకొకరు తినేయడం, ప్లేట్‌లో ఉన్న వక్కని గుటుక్కున మింగేసి అటు ఇటు చూడటం, ఎవరైనా ఇంటికి వెళ్ళి బాగుంది అని కొద్దిగా బాక్స్‌లో సిగ్గు పడకుండా అడిగి తెచ్చుకోవడం, విందులో ఆవకాయ కోసమే కూర్చున్నట్టు అడిగి అడిగి అదే వేయించుకోవడం ఇలా సమయం ఏదైతే ఏంటి ఇది లేనిదే ముద్దదిగదు. ఇంతకూ ఈ మామిడికాయ చేసిన పాపం ఏంటి? రుచిగా ఉండడమా… అందరికీ బాగా నచ్చడమా…! అంటే అవును అనే చెప్పాలి. దేనికి ఉంటుంది, ఆవకాయకి ఉండే రుచి? ఏది అందిస్తుంది ఆవకాయ ఇచ్చే కిక్కు? చిన్న నుండి పెద్దవరకి అందరికీ అది ఆత్మ బంధువు. పేరుకు ముసుగువేసుకున్నా కానీ ఇట్టే దాని రుచితో బయటపడిపోతుంది. ఇందులో మళ్ళీ ఎన్ని రకాల ముసుగులో… ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పచ్చ ఆవకాయ, ఇలా చెప్పుకుంటూ పొతే మరెన్నో… దీని గురించి ఇంత బాధపడుతున్న నేను కూడా అది లేకుండా ఉండలేను. సారీ ఆవకాయ! అంతా లోక కళ్యాణం కోసమే!